- rkr BALUSU
- Apr 16, 2022
- 2 min read
Updated: Oct 15, 2024

హెచ్.ఎం. రెడ్డి (హనుమంత మునియప్ప రెడ్డి) దర్శకత్వం వహించిన“భక్తప్రహ్లాద’’చిత్రం 1932 ఫిబ్రవరి 06వ తేదీన విడుదల అయి తెలుగు సినిమాకు జన్మనిచ్చింది. (ఇప్పటి వరకూ మీడియా వర్గాలు, కొన్ని సిద్దాంత గ్రంధాలు తెలుగు సినిమా విడుదల తేదీని 1931 సెప్టెంబర్ 15వ తేదీ అని రాసాయి. అయితే ముంబై గెజిట్లో, భక్తప్రహ్లాద సెన్సార్ సర్టిఫికేట్లో 1932, ఫిబ్రవరి 06వ తేదీ అని ధృవీకరించినది). తెలుగు సినిమా పుట్టి ఇప్పటికి 94 సంవత్సరాలు అయింది. ఈ 89 ఏళ్ళ కాలాన్ని స్థూలంగా వర్గీకరిస్తే ఖచ్చితంగా 'శివ'కు ముందు 'శివ'కు తర్వాత అని చెప్పాల్సిందే. అయితే శివకు ముందున్న 57 సంవత్సరాలను బాల్య, యవ్వన, నడి వయస్సులుగా వర్గీకరిస్తే ఇలా ఉండొచ్చు.
బిగినింగ్ ఏజ్ (బాల్య దశ ) 1932 నుండి 1945 వరకు 14 ఏళ్లు
యంగ్ ఏజ్ (యవ్వన దశ) 1946 నుండి 1969 వరకు 24 ఏళ్లు
మిడిల్ ఏజ్ (మధ్య దశ) 1970 నుండి 1988 వరకు 19 ఏళ్లు
బాల్య దశ (1932 నుండి 1945): తొలినాళ్ళలో హెచ్. ఎం. రెడ్డి, చిత్తజల్లు పుల్లయ్య, కృత్తివెంటి నాగేశ్వర రావు, పి. పుల్లయ్య, గూడవల్లి రామ బ్రహ్మం, బి.ఎన్. రెడ్డి, వై.వి. రావు, చిత్రపు నారాయణ రావు, కె.వి.రెడ్డి వంటి ‘దర్శక పితామహులు’ - భక్తప్రహ్లాద, చింతామణి, రామదాసు, ప్రేమవిజయం, సారంగధర, గృహలక్ష్మి, మాలపిల్ల, మళ్ళీపెళ్ళి, రైతుబిడ్డ, వందేమాతరం, సుమంగళి, దేవత, మాయలోకం, స్వర్గసీమ, భక్తపోతన, భీష్మ చిత్రాలతో ‘తెలుగు సినిమా’కు నడకలు నేర్పారు.
యవ్వన దశ (1946 నుండి 1969): తెలుగు సినిమాకు స్వర్ణ యుగంగా చెప్పుకునే ఈ దశలో దర్శక పితామహులతో పాటుగా వారిని అనుసరిస్తూ ఎల్.వి.ప్రసాద్, చిత్తూరి వి నాగయ్య, ఘంటసాల బలరామయ్య, కె.ఎస్. ప్రకాశరావు, బి.ఎ. సుబ్బారావు, ఎన్.టి. రామారావు, భానుమతి, కమలాకర కామేశ్వరరావు, వేదాంతం రాఘవయ్య, ఆదుర్తి సుబ్బారావు, తాతినేని ప్రకాశరావు, వి. మధుసూదన రావు, విటలాచార్య వంటి దిగ్దర్శకులు- గృహప్రవేశం, త్యాగయ్య, బాలరాజు, మల్లీశ్వరి, పాతాళభైరవి, బంగారుపాప, పెద్ద మనుషులు, అనార్కలి, కన్యాశుల్కం, రోజులు మారాయి, పాండురంగ మహత్యం, మాయాబజార్, భూకైలాస్, సువర్ణ సుందరి, ఇల్లరికం, మహాకవి కాళిదాసు, సీతారామ కల్యాణం, మిస్సమ్మ, గుండమ్మకధ, దక్షయజ్ఞం, మహామంత్రి తిమ్మరుసు, నర్తనశాల, లవకుశ, గుడిగంటలు, బొబ్బిలి యుద్ధం, దేవత, పాండవ వనవాసం, వీరాభిమన్యు, పల్నాటియుద్ధం, శ్రీక్రిష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, రాము, సుడి గుండాలు, మనుషులు మారాలి, మాతృదేవత, వరకట్నం వంటి కళాఖండాలతో తెలుగు సినిమాకు అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టారు.
మధ్య దశ (1970 నుండి 1988): స్వర్ణ యుగం తర్వాత తెలుగు సినిమా కళాత్మక దృష్టిని విడిచి పెట్టి కమర్షియల్ పంధాలో పయనించటం మొదలు పెట్టింది. కళ కంటే కాసులకు ప్రాధాన్యతను ఇవ్వడంతో రాశి పెరిగినా వాశి తగ్గడం మొదలైంది. అయినప్పటికీ దిగ్దర్శకులతో పాటు, తెలుగు జాతి గర్వించదగిన దర్శకులైన సింగీతం శ్రీనివాసరావు, కె. బాలచందర్, భారతీరాజా, కె. విశ్వనాద్, కె.ఎస్.ఆర్. దాస్, పి. చంద్రశేఖర రెడ్డి, వి. రామచంద్రరావు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, బాపు, విజయనిర్మల, భారతీరాజా, జంధ్యాల, కోడి రామకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి, మణిరత్నం, వంశీ, టి. కృష్ణ, రవిరాజా పినిశెట్టి, బి. గోపాల్ వంటి వారు - దసరాబుల్లోడు, మోసగాళ్ళకు మోసగాడు, ప్రేమనగర్, బడిపంతులు, బందిపోటు, జీవన తరంగాలు, మల్లె పూవు, దేవుడు చేసిన మనుషులు, నేరము-శిక్ష, నోము, ముత్యాల ముగ్గు, అల్లూరి సీతారామరాజు, భక్త కన్నప్ప, అంతు లేని కథ, అడవి రాముడు, దాన వీర శూర కర్ణ, మరో చరిత్ర, పదహారేళ్ళవయసు, ఎర్రగులాబీలు, ముద్ద మందారం, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, దేవత, నిరీక్షణ, శంకరాభరణం, ఖైదీ, మంగమ్మగారి మనవడు, సితార, సాగర సంగమం, అన్వేషణ, ప్రతిఘటన, ఊరికి మొనగాడు, ఈనాడు, కిరాయి కోటిగాడు, సాగర్ (౩డి), సింహాసనం, ఆహ నా పెళ్ళంట, నాయకుడు, రుద్రవీణ, స్వర్ణకమలం, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు వంటి జనరంజకమైన చిత్రాలతో తెలుగు సినిమాకు అపూర్వమైన వైభవాన్ని తీసుకొచ్చారు.
ఈ 57 ఏళ్ల ప్రస్థానంలో తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ లోకి (లవకుశ – 1963) మారి, అటునుంచి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు-1974)గా తయారయ్యి, ఆ పైన ౩డి చిత్రం(సాగర్-1985)గా ఎదిగి, చివరికి విశాలమైన 7౦ ఎం.ఎం. ఫార్మాట్ (సింహాసనం-1986)లోకి ఒదిగిపోయి సాంకేతికంగా పరిపుష్టిని సాధించింది.
తెలుగు సినిమా దాదాపుగా షష్టి పూర్తి చేసుకుంటున్న తరుణంలో “ఉవ్వెత్తున ఎగసి పడిన కల్లోల కడలిలా” రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. 1989లో విడుదలైన ఈ సినిమా, తెలుగు సినిమాకి కొత్త టెక్నిక్, కొత్త ప్రెజంటేషన్, కొత్త వయొలెన్స్ లను పరిచయం చేసి సమూలమైన మార్పులతో స్పీడ్ యుగానికి శ్రీకారం చుట్టింది. అందుకే తెలుగు సినిమా రంగాన్ని ‘శివ’కు ముందు ‘శివ’కు తర్వాత అని విభజించటం సమంజసం అనిపించింది. 'తెలుగు సినిమా – శివ తర్వాత' కాలంలో మరోసారి కలుద్దాం.