తెలుగు సినిమా – ‘శివ’ తర్వాత ...
- rkr BALUSU
- Apr 16, 2022
- 3 min read
Updated: Oct 15, 2024

తెలుగు సినిమా దాదాపుగా షష్టి పూర్తి చేసుకుంటున్న తరుణంలో “ఉవ్వెత్తున ఎగసి పడిన కల్లోల కడలిలా” రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. 1989లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమాకి కొత్త టెక్నిక్, కొత్త ప్రెజంటేషన్, కొత్త వయొలెన్స్ లను పరిచయం చేసి సమూలమైన మార్పులతో స్పీడ్ యుగానికి శ్రీకారం చుట్టింది. ఒక విధంగా ఫక్తు కమర్షియల్ ఫార్మాట్-కి, క్రైం జోడించటం మొదలైంది ఈ సినిమాతోనే. దీనికి ముందు 1977లో విడుదల అయిన ‘అడవి రాముడు’ (20 లక్షల పెట్టుబడికి 4 కోట్లకు పైగా రాబడి), తెలుగు సినిమాను పూర్తి వ్యాపారాత్మకంగా మార్చడానికి బీజాన్ని వేస్తే, ‘శివ’ దాన్ని వట వృక్షంగా మార్చి వేసింది. శివ సినిమా ప్రభావం వల్ల, చిత్ర నిర్మాణంలో స్పీడు పెరిగి, క్వాలిటీ తగ్గి విజయావకాశాల శాతం డైల్యూట్(పలుచన) అయి (వెహికిల్ ఇంజన్ సి.సి. పెరిగే కొద్దీ మైలేజ్ తగ్గినట్టుగా) తెలుగు సినిమా వరం లాంటి శాపాన్ని ఆమోదించింది. 1989 తర్వాత తెలుగు సినిమా చిత్ర నిర్మాణంలో గానీ, నడకలో గానీ, పాటల్లో గానీ, ఫైట్లలో గానీ, న్యూ వేవ్ కమర్షియల్ ఫార్మాట్లో శరవేగంగా పరుగులు పెడుతూ “కళకి ఉన్న ఆత్మను” కోల్పోయింది. 1989 నుండి 2022 వరకు అంటే ఈ 32 ఏళ్ల కాలాన్ని రెండు దశలుగా విభజించవచ్చు.
రిఫ్రెషింగ్ ఏజ్ (నవ్య దశ ) .. 1989 నుండి 1999 వరకు .. 11 ఏళ్లు
2కె ఏజ్ (మిలీనియం దశ) .. 2000 నుండి 2024 వరకు .. 24 ఏళ్లు
నవ్య దశ (1989 నుండి 1999) : శివ సినిమా ప్రభావంతో కథలన్నీ క్రైం అండ్ వయొలెన్స్ చుట్టూ తిరగడం మొదలు పెట్టాయి. దిగ్దర్శకులతో పాటుగా కొత్త దర్శకుల శకం కూడా ప్రారంభమైంది. ఆ కోవలోనే న్యూవేవ్ దర్శకులుగా రామ్ గోపాల్ వర్మ, ఇ.వి.వి. సత్యనారాయణ, విజయబాపినీడు, ప్రియదర్శన్, ఫాజిల్, ఎస్.వి. కృష్ణారెడ్డి, గుణశేఖర్, కృష్ణ వంశీ, కరుణాకరన్, వై.వి.ఎస్. చౌదరి, విజయభాస్కర్, శ్రీను వైట్ల, పి.ఎ. అరుణ్ ప్రసాద్ వంటి యువ దర్శకులు తమదైన శైలిలో ముద్ర వేసారు. శివ, అంకుశం, బొబ్బిలి రాజా, జగదేకవీరుడు -అతిలోకసుందరి, ప్రేమ ఖైదీ, నారీనారీ నడుమ మురారి, ఆదిత్య 369 ,గ్యాంగ్ లీడర్, అల్లరి ప్రియుడు, యమలీల, పెళ్లి సందడి, ఘరానా మొగుడు, భైరవ ద్వీపం, గులాబి, నిన్నే పెళ్ళాడుతా, అన్నమయ్య, పెళ్లి, శుభాకాంక్షలు, తొలిప్రేమ, దేవి, రాజకుమారుడు, సమర సింహారెడ్డి వంటి చిత్రాలతో తెలుగు సినిమాని ఉర్రూతలూగించారు.
మిలీనియం దశ (2000 నుండి 2015) : క్రైం అండ్ వయొలెన్స్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులు ప్రేమ కథా చిత్రాల వైపు మొగ్గు చూపిన దశే మిలీనియం దశ. బాక్స్ఆఫీస్ పూర్తిగా యూత్ & మాస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది కూడా ఈ దశే. 1990 దశకంలో ప్రారంభమైన ‘బుల్లి తెర’ హవా కూడా మొదలై మహిళా ప్రేక్షకులను బుల్లి తెరకు మాత్రమే పరిమితం చేయటం వల్ల, తెలుగు సినిమాకి ‘యువత’ ‘మాస్ ప్రేక్షకులు’ మహారాజ పోషకులుగా మారిపోయారని నిర్ధారణకు వచ్చిన నిర్మాత, దర్శకులు “యువ- చిత్ర – కథలతో ’’ లవ్ ని ప్రధాన అంశంగా చేసుకుని వెండి తెరని రొమాన్స్ వైపు పరిగెత్తించారు. దానికి తోడు 2కె కాలంలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’లో బాగా సంపాదించిన చిన్న సైజు బిల్డర్లు కూడా పెద్ద నిర్మాతలుగా మారిపోయి సినిమా విలువలు – విజయాల శాతం పడిపోవటానికి, తన వంతు కృషిని చాలా శ్రద్దగా చేశారు. రాం గోపాల్ వర్మతో పాటుగా ఆయన శిష్య పరంపర విజ్రుంభణ కూడా మొదలైంది. మిలీనియం డైరెక్టర్లుగా పూరీ జగన్నాధ్, తేజ, ఎస్.ఎస్. రాజమౌళి, ఎస్.జే. సూర్య, కాశీ విశ్వనాద్, వి.వి. వినాయక్, అల్లరి రవి బాబు, త్రివిక్రం శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, జయ, సూర్య కిరణ్, నీలకంట , సుకుమార్, ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి, చంద్రశేఖర్ ఏలేటి, శేఖర్ కమ్ముల, ప్రభుదేవా, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, రమేష్ వర్మ, హరీష్ శంకర్, మోహన్ కృష్ణ, ఇంద్రగంటి, క్రిష్,, మెహెర్ రమేష్, నందినీ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి,, సుధీర్ వర్మ, శ్రీవాస్, వంశీ పైడిపల్లి, మారుతి, విక్రం కుమార్, దేవ్ కట్టా, సంతోష్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని, సంపత్ నంది, ఓంకార్ అనిల్ రావిపూడి, వంగా సందీప్ వంటి వారు - చిత్రం, బద్రి, నువ్వే కావాలి, నరసింహ నాయుడు, ఖుషీ, ఆది, ఇంద్ర, ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్, వర్షం, ఆర్య, ఐతే, యజ్ఞం, ఆనంద్, 7జి.బృందావన్ కాలనీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతనొక్కడే, భద్ర, అతడు, పోకిరి, చత్రపతి, యమదొంగ, గమ్యం, మగధీర, అరుంధతి, సింహ, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్, ఈగ, అత్తారింటికి దారేది, లెజెండ్, బలుపు, బాహుబలి, రుద్రమ దేవి, శ్రీమంతుడు, అర్జున్ రెడ్డి, రాజు గారి గది, మహానటి, రంగస్థలం, F2, అల వైకుంఠపురములో, అఖండ, వంటి చిత్రాలతో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించారు, ముఖ్యంగా 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్ ', RRR వంటి సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపుని తీసుకొచ్చి తెలుగు వారంతా గర్వ పడేలా చేశాడు.
సాంకేతికంగా మిలీనియంలో తెలుగు సినిమా మరింతగా ఎదిగింది. డి.టి.ఎస్. సౌండ్ టెక్నాలజీతో (మాస్టర్ -1997) దూసుకుపోయి, డాల్బీ ఎట్మోస్, (బాహుబలి -2015), 3డి-70 ఎం.ఎం.గా (రుద్రమదేవి -2015) విజ్రుంభించి, డాల్బీ విజన్ (RRR-2022) గా విస్తరించి, తెలుగు వాడి సత్తాని జాతీయ స్థాయిలో వినిపించింది. మాన్యువల్ ఎడిటింగ్ నుంచి యావిడ్ వైపు, అనలాగ్ మ్యూజిక్ నుంచి డిజిటల్ మ్యూజిక్ వైపు, ల్యాబ్ ప్రింట్ల నుండి శాటిలైట్ డౌన్ లోడ్ డిజిటల్ ప్రింట్ల (క్యూబ్, యు.ఎఫ్.ఓ, పి.ఎక్స్.డి) వైపుగా పయనించి, 4కె నుంచి 5 K రిజేల్యుషన్ సాక్షిగా తెలుగు వారికి క్వాలిటీ సినిమాని చూపించింది.
అయితే రాశి పెరిగినా వాసి తగ్గడానికి కారణం ఏమిటి? ఈ 32 ఏళ్ల కాలంలో తెలుగు సినిమా విజయాల శాతం సంవత్సరానికి 10 % నుండి 20% మధ్యనే ఎలా ఆగిపోయింది ? ఎన్ని సినిమాలు విడుదల అయ్యాయి ? ఎన్ని సినిమాలు విజయాన్ని సాధించాయి ? పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం.
Comments